గేమ్ మారబోతోంది.. రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్..!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మార్విక్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’. అయితే ఈ చిత్రం.. రెండేళ్ల నుంచి షూటింగ్ జరుపుకుంటోంది. దర్శకుడు శంకర్ ఈ చిత్రంతో పాటు ‘ఇండియన్ 2’ సినిమాని చెయ్యాల్సిన పరిస్థితి రావడం కూడా ఈ ప్రాజెక్ట్ ఆలస్యం అవ్వడానికి ప్రధాన కారణం. దీని కారణంగా చరణ్ తన తరువాత బుచ్చిబాబు తో చేయబోయే మూవీ కూడా ఇంకా ప్రారంభం అవ్వలేదు. అయితే ఆదివారంతో గేమ్ ఛేంజర్ లో చరణ్ పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేసారు. ఈ విషయాన్ని రామ్ చరణ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.
“గేమ్ మారబోతోంది.. ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ పూర్తి చేశాను. త్వరలో సినిమాస్ లో కలుద్దాం” అని రామ్ చరణ్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసారు. ఈ సందర్భంగా చరణ్ గేమ్ ఛేంజర్ మొదటి రోజు ఫోటోని ఆఖరి రోజు షూటింగ్ చేసిన ఫోటోని జత చేసి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసారు. ఇవే ఫోటోలను ప్రొడక్షన్ హౌస్ కూడా ”మార్స్ నుంచి మాస్ పీస్ వచ్చేనండి.. స్టారుల్లోక్కటైన స్టారు వొచ్చేనండి” అంటూ ‘జరగండి’ పాటలోని లిరిక్స్ తో తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసారు. ”ఇది మా ‘గేమ్ ఛేంజర్’ రామ్ చరణ్ షూటింగ్ మొదటి రోజు నుండి చివరి రోజు వరకు సాగిన మెగా పవర్ ప్యాక్డ్ జర్నీ. షూటింగ్ పూర్తయింది. త్వరలో మీకు కొన్ని క్రేజీ అప్‌డేట్‌లను అందిస్తాం” అని అంటూ పోస్ట్ లో పేర్కొన్నారు.
‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనూ దర్శకుడు శంకర్ ‘గేమ్ ఛేంజర్’ మూవీ గురించి కాసేపు మాట్లాడారు. ”రామ్ చరణ్ పార్ట్ షూటింగ్ పూర్తయింది. చరణ్ గురించి చెప్పాలంటే ఎక్సలెంట్ స్క్రీన్ ప్రజెన్స్. ఆయన దగ్గర ఒక కంట్రోల్డ్ పవర్ ఉంటుంది. ఎప్పుడు బ్లాస్ట్ అయిపోతుందా? అని ఎదురు చూసే పవర్ ఉన్న మంచి యాక్టర్. సినిమాలో అది మీకు అర్థం అవుతుంది. రామ్ చరణ్ తో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. మరో 10 – 12 రోజులు షూటింగ్ చేయాల్సి ఉంది. అది పూర్తి అవ్వగానే రిలీజ్ డేట్ ని ప్రకటిస్తాం” అని శంకర్ చెప్పారు.
For more updates: The Film Nagar